క్యుములోనింబస్ మేఘాల కారణంగా సోమవారం రాత్రి నుంచి మంగళవారం వరకు కామారెడ్డి, సిద్దిపేట, మెదక్, ములుగు, పెద్దపల్లి జిల్లాల్లో భారీ వర్షాలు కురువగా, జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో ఓ మోస్తరు వాన, యాదాద్రి జిల్లాలో తేలికపాటి జల్లులు పడ్డాయి. వర్షం కారణంగా ఆరు జిల్లాల్లో భారీగా పంట నష్టం జరిగింది. పలుచోట్ల చెరువులు పొంగిపొర్లుతున్నాయి. అత్యధికంగా మెదక్ జిల్లా నార్సింగ్ మండలంలో 12.1 సెం.మీ. వర్షపాతం నమోదైంది. కాగా గ్రేటర్ హైదరాబాద్‌లోని పలు ప్రాంతాల్లో ఓ మోస్తరు నుంచి భారీ వర్షం పడింది. వచ్చే 48 గంటల్లో రాష్ట్రంలోని పలుచోట్ల భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్టు వాతావరణ కేంద్రం వెల్లడించింది.
కామారెడ్డి జిల్లా వ్యాప్తంగా సోమవారం అర్ధరాత్రి భారీ వర్షం కురిసింది. దీంతో బిచ్కుంద మండలం పెద్ద దేవడ వద్ద డైవర్షన్ రోడ్డు కొట్టుకుపోవడంతో బిచ్కుంద, బాన్సువాడ మధ్య రాకపోకలు పూర్తిగా నిలిచిపోయాయి. పిడుగుపాటుకు నాగిరెడ్డిపేట్ మండ లం బొల్లారం గ్రామానికి చెందిన వీఆర్‌ఏ మంద లచ్చయ్య (41) మృతి చెందాడు. పంట పొలం వద్ద నిద్రిస్తున్న లచ్చయ్యపై పిడుగుపడటంతో అక్కడికక్కడే మరణించాడు. కాగా కామారెడ్డి జిల్లా బీబీపేట్ మండలం కూడవెల్లి వాగులో చేపలు పట్టేందుకు వెళ్లిన వేణు అనే యువకుడు గల్లంతయ్యాడు. అత్యధికంగా బిచ్కుంద మండలంలో 5.9 సెం.మీ. వర్షపాతం నమోదుకాగా జిల్లా వ్యాప్తంగా 1.7 సెం.మీ. వర్షపాతం రికార్డయింది.మెదక్ జిల్లా వ్యాప్తంగా సోమవారం రాత్రి భారీ వర్షం కురిసింది. మెదక్ మండలంలోని పసుపులేరువాగు ఉధృతంగా ప్రవహిస్తున్నది.